విజయవాడ నున్నలో జరిగిన పాశవిక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని ఓ బాలికను చేరదీస్తున్న బాబాయ్.. ఆ మైనర్ బాలిక అత్యాచారం చేసి గర్భవతిని చేసిన దుర్ఘటన విజయవాడ సమీపంలోని నున్న పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో బాలిక తన పిన్ని, బాబాయ్ దగ్గర నివసిస్తోంది. అయితే అదే ఆశ్రయం ఆమెకు నరకయాతనగా మారింది. ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఆమె బాబాయ్ పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. అనారోగ్యంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షలు చేయగా, ఈ విషయం బయటపడింది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత బాబాయ్ తనపై దాడి చేసేవాడని, నోరు మూసి బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడని తెలిపింది. ఎవరైనా చెబితే చంపేస్తానని తరచుగా బెదిరించేవాడని పేర్కొంది. ఈ కారణంగా బాలిక మౌనం పాటించిందని, కానీ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యులు ఆమె గర్భవతిగా ఉన్నట్టు నిర్ధారించారని సమాచారం.
వైద్యుల నివేదిక ఆధారంగా బాలిక కన్నీటి పర్యంతమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించిన నున్న పోలీసులు నిందితుడిపై BNS 64(2)(R), 65(1), సెక్షన్ 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.








