ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు దాడిలో గాయపడిన ఉత్తరకొరియా సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బంధీగా తీసుకువెళ్లినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.
రష్యా, ఉత్తరకొరియా మధ్య సైనిక సహకారంతో వేలాది ఉత్తరకొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు సమాచారం. క్రస్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికుల ఆకస్మిక దాడి సందర్భంగా ఈ బంధీ ఘటన చోటుచేసుకుందనేది దక్షిణ కొరియా వాదన. కాగా, ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న గాయపడిన ఉత్తర కొరియా సైనికుడు మరణించాడని దక్షిణ కొరియా అంటోంది.
ఉత్తరకొరియా సైనికుల భయంకర పరిస్థితి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులు ముందుండి పోరాడుతున్నా, ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు సమర్థంగా ప్రతిస్పందించలేకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఉత్తరకొరియా సైనికులు మరణించారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఈ సంఘటన ఉత్తరకొరియా రష్యా సహకారంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది.