సాధారణంగా హీరోయిన్లు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు ఈజీగా చేస్తారు. కానీ నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal) మాత్రం ఐదేళ్లలో కేవలం ఒకే ఒక సినిమా (One Film) చేసింది. అవకాశాలు రాక కాదు, భారీ ప్రాజెక్టులు వచ్చినా ఆమె చేయలేకపోయింది. దీనికి కారణం ఐదేళ్ల క్రితం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా కోసం చేసుకున్న అగ్రిమెంట్.
ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించకూడదని చిత్రబృందం ఆమెతో అగ్రిమెంట్ రాసుకుంది. పెద్ద ప్రాజెక్ట్ కదా, మహా అయితే ఏడాది పడుతుందని భావించి నిధి ఒప్పుకుంది. కానీ ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ, చివరికి ఐదేళ్ల తర్వాత విడుదలకి సిద్ధమైంది.
ఆర్థిక ఇబ్బందులు లేకుండా..
ఈ ఐదేళ్లలో నిధికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాలేదని ఆమె స్వయంగా తెలిపింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, “నెలకు కనీసం ఒక షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. ఆ డబ్బు సరిపోయేది” అని నిధి అగర్వాల్ చెప్పింది. ఐదేళ్లు వేచి చూసినా, ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానని నిధి పేర్కొంది.