ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (70)కి ఐదేళ్ల జైలు శిక్ష పడటంతో, ఫ్రెంచ్ చరిత్రలో జైలు శిక్ష అనుభవించనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి లిబియా నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందిన కేసులో నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పారిస్‌లోని లా శాంటే జైలులో ఆయన శిక్ష మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ చారిత్రక తీర్పుపై సర్కోజీ తాను నిర్దోషినని వాదిస్తూ అప్పీలు చేసినప్పటికీ, అప్పీల్ విచారణ కోసం వేచి ఉండకుండా వెంటనే శిక్షను ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.
భద్రతా కారణాల దృష్ట్యా సర్కోజీకి జైలులోని ‘వీఐపీ విభాగం’లో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. ఈ విభాగం సాధారణ ఖైదీల నుంచి వేరుగా ఉంటుంది. మాజీ వ్యాపారవేత్త, రచయిత పియరీ బాటన్ వంటి ప్రసిద్ధ ఖైదీలు శిక్ష అనుభవించిన ఈ జైలును ఇటీవలి సంవత్సరాలలో పూర్తిగా పునరుద్ధరించారు. అయితే, ఆయన కేవలం ఒక సాధారణ వ్యక్తిలా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, వీఐపీ ట్రీట్‌మెంట్ ఉండదని మాజీ ఖైదీలు పేర్కొంటున్నారు.
అప్పీలు పెండింగ్‌లో ఉన్నా జైలుకు పంపడాన్ని సర్కోజీ వ్యతిరేకించారు. “నేను జైలుకు భయపడను. చివరి శ్వాస వరకు పోరాడుతాను” అని ఆయన పేర్కొన్నారు. జైలుకు సిద్ధపడిన సర్కోజీ, తనతో పాటు దుస్తులు, కుటుంబ ఛాయాచిత్రాలు, అలాగే ‘ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో’ వంటి మూడు పుస్తకాలను తీసుకువెళుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం, జైలుకు చేరుకున్న తర్వాతే ఆయన తన విడుదల కోసం అభ్యర్థన దాఖలు చేసుకోగలరు. ఈ అభ్యర్థనను పరిశీలించడానికి న్యాయమూర్తులకు రెండు నెలల సమయం ఉంటుంది.





 



