భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి హ‌త్య‌

భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి హ‌త్య‌

ఇటీవ‌ల కొంద‌రు భార్య‌ల‌ను చేస్తున్న ఘోర‌మైన కుట్ర‌ల‌కు భ‌ర్త‌లు బ‌ల‌వుతున్నారు. హ‌నీమూన్‌కు తీసుకెళ్లి భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఓ దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కేవలం మూడు నెలలకే భర్తను హత్య చేయించిన భార్య కథ వింటే ఎవరికైనా గగుర్పాటు కలగాల్సిందే. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి, ముందే ప్లాన్ చేసిన విధంగా ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన రాజస్థాన్‌లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

శ్రీరాంనగర్‌కు చెందిన ఆశిష్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన అంజూ అనే మహిళను మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వారి జీవితం సవ్యంగా సాగుతున్నట్లు అందరూ భావించారు. అయితే జనవరి 30వ తేదీ రాత్రి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆశిష్, అంజూలను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆశిష్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు అంజూను విచారించగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి తమను ఢీకొట్టి నగలు లాక్కెళ్లారని ఆమె తెలిపింది. అయితే ఆమె వాంగ్మూలానికి, ఘటనా స్థలంలో కనిపించిన ఆధారాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం లోతైన విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని బయటకు తీసుకొచ్చారు.

విచారణలో అంజూ పెళ్లికి ముందే సంజూ అనే యువకుడిని ప్రేమించిందని, వివాహం అనంతరం కూడా అతనితో ఫోన్‌లో సంబంధం కొనసాగించిందని పోలీసులు గుర్తించారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో సంజూతో కలిసి భర్తను హత్య చేయాలనే కుట్రను ఆమె రచించినట్లు తేలింది. ఆ ప్లాన్ ప్రకారమే అంజూ తన భర్త ఆశిష్‌ను నిర్మానుష్య రహదారిపై వాకింగ్‌కు తీసుకెళ్లింది. అక్కడ ముందే సిద్ధంగా ఉన్న సంజూ, అతని స్నేహితులు ఆశిష్‌పై దాడి చేసి హత్య చేశారు.

ఈ ఘటనను దోపిడీగా చిత్రీకరించేందుకు అంజూ తన మొబైల్ ఫోన్, చెవి కమ్మలను సంజూకి ఇచ్చి పంపించిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం తానే స్పృహ తప్పి పడిపోయినట్లు నటించి అందరిని మోసం చేయాలని ప్రయత్నించిందని తెలిపారు. అయితే పోలీసుల చాకచక్యంతో ఆమె కథ బట్టబయలైంది. ఈ కేసులో అంజూను, ఆమె ప్రియుడు సంజూతో పాటు హత్యలో పాల్గొన్న ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మేఘాలయ హనీమూన్ హత్య కేసును తలపిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment