ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటార్ వెహికల్ చట్టం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారికి భారీ జరిమానాలను విధించేందుకు సన్నద్ధమయ్యారు.
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1000 ఫైన్, సీట్ బెల్ట్ లేకుండా కార్ డ్రైవ్ చేస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే రూ.10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ.1000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5000 జరిమానాతో వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా పెంచారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నిబంధనలను పాటించి జరిమానాల బారి నుంచి తప్పించుకోవాలని సూచించారు.