నేపాల్‌లో జరుగుతున్న నేపాల్ ప్రధాని కేపీ ఓలి (ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి) తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో పదవి నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. తన బాధ్యతలను డిప్యూటీ పీఎంకు అప్పగించి మంగళవారం అధికారికంగా రాజీనామా సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భీకర నిరసనలు, ప్రాణనష్టం కలిగిన పోలీసు దాడుల నేపథ్యంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నిరసనల ఉధృతి
దేశవ్యాప్తంగా అవినీతి, నిరుద్యోగం, సామాజిక అసమానతలపై యువత పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలను నిషేధించడంతో ఆగ్రహం మరింత పెరిగింది. ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. సోమవారం కాఠ్మాండు నగరంలో జరిగిన ఘర్షణల్లో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా, సున్సారి జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అందులో 100 మందికి పైగా పోలీసులు కూడా ఉన్నారు. అంనెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, నిరసనకారులపై ప్రత్యక్ష కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి దీనిపై తక్షణ, పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
రాజకీయ అస్థిరత
ఓలి (73) మంగళవారం అన్ని పార్టీలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపుతానని ప్రకటించినప్పటికీ, చివరికి రాజీనామా చేయడం నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను బయటపెట్టింది. ప్రజా అసంతృప్తి, ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం హిమ దేశాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టింది.








