ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారిన పెరోల్ జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్ అయ్యింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో ఆమె బహిర్గతం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హోంమంత్రి అనితతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ పేర్లను బయటపెట్టడంతో ప్రభుత్వం ఆమెపై టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై నిన్న సాయంత్రం హోంమంత్రి ప్రకటన చేసిన కొన్ని గంటలకే పోలీసులు అరుణను అదుపులోకి తీసుకున్నారు.
అరుణ అరెస్ట్ వెనుక మరిన్ని రాజకీయ నేతల పేర్లు బయటపడతాయన్న అనుమానమే కారణమని చర్చ సాగుతోంది. ఆమెను అరెస్ట్ చేసే ముందు కారు డిక్కీలో దాక్కుని స్వయంగా రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేసింది అరుణ. “నన్ను ప్రెస్, మీడియా కాపాడాలి. పోలీసులు అక్రమంగా నన్ను నిర్బంధిస్తున్నారు. నా ప్రాణాలు తీస్తారో ఉంచుతారో తెలియదు” అని ఆ వీడియోలో అరుణ కన్నీటి పర్యంతమయ్యారు.
అరుణ ఆరోపణల ప్రకారం, పోలీసులు ఆమె కారులో గంజాయి పెట్టి అక్రమ కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. “నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు, నన్ను ఏ అక్రమ కేసులో ఇరికిస్తున్నారో అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి నెల్లూరు వైపే నిలిచింది.





 



