‘ఫిష్‌ వెంకట్‌’కు ఎందుకు సాయం చేయాలి?: నట్టి కుమార్‌ కీలక వ్యాఖ్యలు

‘ఫిష్‌ వెంకట్‌’కు ఎందుకు సాయం చేయాలి?: నట్టి కుమార్‌ కీలక వ్యాఖ్యలు


టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించిన తర్వాత సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కుటుంబం సహాయం కోసం అభ్యర్థించినా, పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. చిన్న నటులు మరణిస్తే కనీసం సానుభూతి, సాయం కూడా కనపించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా నిర్మాత నట్టి కుమార్‌ స్పందించారు.

నట్టి కుమార్‌ ఏమన్నారంటే..
ఫిష్‌ వెంకట్‌ మరణంపై నిర్మాత నట్టి కుమార్‌ మాట్లాడుతూ, “కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. పరిశ్రమతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తేనే సెలబ్రిటీలు అక్కడ కనిపిస్తారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచం… ఎవరి పనిలో వారు ఉంటారు. ఇక్కడ ఎవరు మరణించారు..? అని తెలుసుకునేంత టైమ్‌ ఎవరికీ ఉండదు. నేను చెబుతున్న మాటలు ఫిష్‌ వెంకట్‌ ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులకు కూడా బాధ కలిగించొచ్చు. రేపు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చినా అంతే.” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు, ఫిలిం ఛాంబర్‌తో నిత్యం టచ్‌లో ఉన్నవారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారు. గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌తో ఫిష్‌ వెంకట్‌ టచ్‌లో ఉంటారు. కాబట్టి, వారు ఆయనతో కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ అయ్యోపాపం అని కూడా అనరు.” అని పేర్కొన్నారు.

“సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఆశించకండి!”
“వెంకట్‌ను ఎవరూ పలకరించలేదని చాలామందికి బాధ ఉండొచ్చు. మొదట ఆయన అసోసియేషన్‌ మెంబర్‌ కాదు. సభ్యత్వం కూడా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఎవరూ ఆశించకండి… ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారని ఎదురుచూడకండి.” అని నట్టి కుమార్‌ స్పష్టం చేశారు.

“రోజుకు రూ. 3 వేల రెమ్యునరేషన్‌ తీసుకునే స్థాయి నుంచి రూ. 30 వేలు తీసుకునే రేంజ్‌కు కూడా వెంకట్‌ చేరుకున్నాడు. మన దగ్గరకు డబ్బు వచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఎవరూ సాయం చేస్తామని ముందుకు రారు. ఈ విషయంలో ఒకరిని తప్పుబట్టడం ఎందుకు..? లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవాలి. మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్థిక సాయాలు అందరూ చేయరు.” అని నట్టి కుమార్‌ తన వ్యాఖ్యలను ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment