తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ నారాయణ జూనియర్ కాలేజీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. విద్యను వ్యాపారంగా మార్చుకున్న యాజమాన్యం, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై అమానవీయంగా వ్యవహరిస్తూ, ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ విద్యా వ్యవస్థలోని చీకటి కోణాన్ని ఈ ఘటనలు మరోసారి బయటపెడుతున్నాయి.
క్యాంపస్‌లలో హింస – వికృత రూపం
ఇటీవల తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో ఉన్న వెంకటాద్రి క్యాంపస్‌లో ఒక విద్యార్థిపై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. ఇది ఒక్క ఘటనతోనే ఆగిపోలేదు. ఎం.ఆర్.పల్లి బ్రాంచ్‌లో కూడా ఇలాంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నా, తమ పిల్లలకు కనీస భద్రత, గౌరవం కూడా లభించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లు విద్యకు నిలయంగా ఉండాల్సింది పోయి, భయాందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అవినీతి కూపంగా మారిన యాజమాన్యం
ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం అనుకున్న అవినీతి, ఇప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ బహిర్గతమవుతోంది. ఒక విద్యార్థి చెల్లించిన ఫీజును కళాశాల ఉద్యోగి తన సొంత ఖాతాకు మళ్లించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలియని ప్రిన్సిపాల్, ఫీజు చెల్లించలేదంటూ విద్యార్థి తండ్రిని వేధించిన ఘటన నారాయణ సంస్థల పనితీరుపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతోంది. ఆడిటింగ్ ప్రక్రియలోనూ భారీ ఆర్థిక అక్రమాలు బయటపడుతున్నట్లు సమాచారం.
నాణ్యత లేని బోధన – కమీషన్ల దందా
అర్హతలు, అనుభవం లేని అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్న ఆరోపణలు మరింత తీవ్రమవుతున్నాయి. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని తెలుస్తోంది.
కోర్ డీన్లు, డీన్ల అరాచకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది డీన్లు తమ పరిధిలోని అధ్యాపకులకు అధిక జీతాలు ఇప్పించి, అందులో 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ రూపంలో తిరిగి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సంస్థ ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి.
తల్లిదండ్రులకు హెచ్చరిక
ఈ పరిస్థితులను గమనిస్తున్న విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్‌లో అడుగుపెట్టబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాలల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం పేరున్న సంస్థ అనే ముద్రతో మోసపోతే, పిల్లల భవిష్యత్తుతో పాటు ఆర్థికంగా కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’