టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగింది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత, నాగసుశీల ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు, రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా ఈ భేటీలో హాజరయ్యారు.
ప్రధాని మోడీ ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలకు నాగార్జున సోషల్ మీడియా ద్వారా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. నాగ చైతన్య కూడా ప్రత్యేకంగా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
గతంలోనూ నాగార్జున పలుమార్లు ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ భేటీకి సంబంధించి మరింత ఆసక్తికరమైన విశేషాలు అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.