ఓ వింత వ్యాధి జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఒకే గ్రామంలోని రెండు కుటుంబాల్లోని 8 మంది మరణించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి గురించి సమాచారం తక్కువగా ఉండటం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో రోగులు మరణించడం, ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వం వెంటనే స్పందించింది..
రెండు కుటుంబాల్లో మరణాల తీవ్రత కనిపించడంతో, ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు ప్రారంభించింది. అత్యంత ఆధునికమైన BSL-3 మొబైల్ లేబోరేటరీను ప్రాంతానికి పంపించింది. వ్యాధికి సంబంధించిన ప్రాథమిక కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సాయం పొందాలని అధికారులు సూచించారు.
వ్యాధి మూలాలు, ప్రమాద స్థాయి
ఇప్పటివరకు ఈ వ్యాధి మూలాలు ఇంకా గుర్తించలేదు. ఇది ఒక కొత్త రకం వైరస్ కావొచ్చని, లేదా ఇప్పటికే ఉన్న వ్యాధులలో ఒకటిగా ఉండవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఒక గ్రామంలోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నారు.








