ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం మూలపాడు (Moolapadu) గ్రామం సమీపంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నాయి. వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో చిక్కుకుని ఒక చుక్కల జింక, దుప్పి, కొండముచ్చు ప్రాణాలు కోల్పోయాయి.
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా వన్యప్రాణులు బలవుతున్నారని, ఇంత పెద్ద ఘటన జరిగినా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్(Pavan Kalyan) దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, వేటగాడిగా జీవిస్తున్న మణి అనే వ్యక్తిని బటర్‌ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతానికి కాపలాదారుగా నియమించడం మరింత విమర్శలకు దారి తీస్తోంది. వేటాడే వారినే రక్షకులుగా పెట్టడం సరైన నిర్ణయమా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూలపాడు అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కదలికలు పెరిగిపోవడం పర్యావరణ పరిరక్షణపై ఆందోళన కలిగిస్తోంది. వన్యప్రాణులను రక్షించే బాధ్యత గల అటవీ శాఖ ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.







