టీ20 మరియు వన్డే ప్రపంచ కప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించిన ధోనీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో కొనసాగుతున్న ధోనీ (Dhoni)కి, భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకునేలా మెంటార్ బాధ్యతలు (Mentor Responsibilities) అప్పగించాలని బీసీసీఐ (BCCI) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో, 2021 టీ20 ప్రపంచకప్ (World Cup) సమయంలో కేవలం ఆ టోర్నీకి మాత్రమే మెంటార్‌గా ధోనీ సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంది. అయితే, ఈసారి దీర్ఘకాలిక ఒప్పందంపై బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కు ధోనీ అంగీకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గంభీర్ అంగీకరిస్తాడా?
ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ధోనీని మెంటార్‌గా నియమించడాన్ని అంగీకరిస్తాడా అనే చర్చ మొదలైంది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ధోనీ నాయకత్వంలోని ప్రపంచకప్ విజయాల క్రెడిట్‌పై గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ నిర్ణయానికి ఆయన అంగీకరించకపోవచ్చని అంటున్నారు. అయితే, ఇటీవల ఒక కార్యక్రమంలో ధోనీ, గంభీర్ కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇది వారి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని సూచిస్తోంది.








