విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త తనను అనుమానించాడని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం ఒక పాప జన్మించింది. అయితే మొదటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటరమణ, పాప పుట్టిన తర్వాత అతని అనుమానం తీవ్రమైంది. ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. భర్త నుంచి నిరంతరం వేధింపులకు గురైన శిరీష తీవ్ర మనోవేదనకు గురైంది.
కన్నబిడ్డను హత్య
మార్చి 13న పడుకున్న తన పాపను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా సముద్రతీరానికి తీసుకెళ్లి, పాప మృతదేహంతో కలిసి నీటిలోకి దూకింది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి భర్తకు ఫోన్ చేసి, కెరటాల ధాటికి పాప నీటిలో మునిగిపోయిందని చెప్పింది. అయితే మొదటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటరమణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరాడక మృతి చెందినట్లు తేలింది. విచారణలో శిరీష తన పాపను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.







