మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ ఎస్కేప్‌.. ఏపీ పోలీసుల గాలింపు

మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ ఎస్కేప్‌.. ఏపీ పోలీసుల గాలింపు

రాష్ట్రవ్యాప్తంగా పలు దొంగతనాల కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా గుర్తింపుపొందిన బత్తుల ప్రభాకర్‌ పరారీ ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తీసుకువెళ్తున్న సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరులో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు సీరియస్‌గా స్పందించారు.

విధి నిర్వహణలో అలసత్వం ప్ర‌ద‌ర్శించి మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ పరారీకి కారణమైన ఇద్దరు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లపై వేటు పడింది. హెడ్‌ కానిస్టేబుళ్లైన సుగుణకరరావు, షడ్రక్‌లను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపులో నిమగ్నమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

ప్రభాకర్‌ అత్యంత ప్రమాదకర నిందితుడిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలే ప్రధాన టార్గెట్‌గా చోరీలకు పాల్పడిన ఈ నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 42 కేసులు, తమిళనాడు, కర్ణాటక, కేరళలో మరో 44 కేసులు నమోదు అయ్యాయి. గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులపై కాల్పులు జరిపిన కేసులోనూ అతడే ప్రధాన నిందితుడు. ప్రభాకర్‌ పరారీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసులు అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment