ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం (Low Pressure) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలపై ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ-వాయువ్య (West-Northwest) దిశగా కదులుతూ ఈ అల్పపీడనం నేడు వాయుగుండం (Cyclone)గా మారనుంది. రేపటికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఎల్లుండికి ఇది నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని తుపానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దిశ, తీవ్రతపై నిత్యం సమీక్ష జరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హెచ్చరిక మోడ్లో ఉందని స్పష్టం చేశారు.








