సాధారణంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. అయితే కేరళలో మాత్రం విభిన్న దృశ్యం కనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను (Pinarayi Vijayan) మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకి (Interview) సంబంధించిన ప్రోమో విడుదలవగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌజ్’ (Cliff House)లో ఈ ప్రత్యేక సంభాషణ జరిగింది. సాధారణంగా గంభీరంగా కనిపించే పినరయి విజయన్, మోహన్ లాల్ (Mohanlal) అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా స్పందించినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ విధానాలు వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో కూడా మోహన్ లాల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని (Oommen Chandy) ఇంటర్వ్యూ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు పినరయి విజయన్‌తో చేసిన ఈ సంభాషణ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావడం చర్చనీయాంశమవగా, ఇది ప్రభుత్వ పీఆర్ కార్యక్రమాల్లో భాగమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, ఒక నటుడిగా కాకుండా సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రిని కలవడం ప్రత్యేక అనుభూతి అని మోహన్ లాల్ వ్యాఖ్యానించారు.







