ఇటీవల భారత క్రికెట్ (Indian Cricket)లో అనేకమంది సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన వేళ, మహ్మద్ షమీ (Mohammed Shami) పేరు కూడా రిటైర్‌మెంట్ (Retirement) చర్చల్లో వినిపిస్తోంది. అయితే, షమీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. “రిటైర్‌మెంట్ నా నిర్ణయం, మీరు కాదు. ఆటపై విసుగు వచ్చే వరకూ ఆడతాను,” అని స్పష్టంగా తెలిపారు.
రిటైర్‌మెంట్ గురించి పుకార్లకు గట్టి సమాధానం
“ఎవరికైనా నా రిటైర్‌మెంట్‌తో జీవితాలు మెరుగవుతాయని అనిపిస్తే, నాతో నేరుగా చెప్పండి… ఆ తర్వాత ఆలోచిస్తా,” అంటూ షమీ ఖంగారుగా వ్యాఖ్యానించారు. “ఇప్పట్లో నాకు ఆటను వదిలే ఉద్దేశం లేదు. నా మీదే ఆసక్తి తగ్గితే తప్ప, రిటైర్‌మెంట్ అనే మాట నాకు దరిచేరదు,” అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లో అవకాశం లేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని షమీ తెలిపారు. “మీకు బోర్ కొట్టినప్పుడు నా రిటైర్‌మెంట్ గురించి ఆలోచించడం మానండి,” అంటూ విమర్శకులపై మండిపడ్డారు.
పునరాగమనం కోసం కసితీర్చిన శ్రమ
గత రెండు నెలలుగా తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నట్టు షమీ వెల్లడించారు. “నా శరీర బరువును నియంత్రించాను. నైపుణ్యాలపై మరింత శ్రద్ధ పెట్టాను. ముఖ్యంగా బౌలింగ్‌లో లయను పుంజుకోవడమే నా లక్ష్యం. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాను,” అని వివరించారు.
గతంలో గాయాల కారణంగా జట్టుకు దూరమైన షమీ, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడమే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్ (New Zealand)తో వన్డేలు, ఇంగ్లాండ్ (England)తో టీ20లు ఆడిన తర్వాత అతడు గాయాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే, తిరిగి పునరాగమనం కోసం షమీ చేస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోంది.







