ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై శుక్రవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణనపై వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానమంత్రి మోడీ బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ కులం గురించి తాను అన్నీ తెలుసుకొనే మాట్లాడుతున్నానని చెప్పారు. పీఎం మోడీ పుట్టుక ఉన్నత కులం అయినా, 2001లో మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కుల గణనను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసరంగా దీనిపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణనపై అపోహలను సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. కులగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలిందని వివరించారు.
కాగా, ప్రధాని మోడీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.