హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి నిందితుడి ఫోటో చూపించగా, తనపై దాడి చేసినవాడతనే అని ఆమె నిర్ధారించింది.
జంగం మహేశ్ గతంలోనూ నేరాలలో పాల్పడిన వ్యక్తి. ఏడాది క్రితం అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఒంటరిగా ఉంటూ గంజాయి అలవాటుకు బానిసయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ నెల 22వ తేదీ సాయంత్రం, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 23 ఏళ్ల యువతి మేడ్చల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణం చేస్తోంది. సికింద్రాబాద్‌లో తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకుని తిరిగి మేడ్చల్ వెళ్లే ట్రైన్‌లో ఉమెన్స్ కోచ్‌లో ఎక్కింది. అల్వాల్ స్టేషన్లో మిగతా మహిళలు దిగిపోవడంతో, యువతి ఒంటరిగిపోయింది. అదే సమయంలో దుండగుడు (25) ఆమెకు సమీపంగా వచ్చి లైంగికదాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో, కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమెను వైద్యులు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.








