బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇటీవల తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి అడుగు ఏంటన్న ఉత్కంఠ రాజకీయం పట్ల ఆసక్తిగల వర్గాల్లో నెలకొంది. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ (Banjara Hills) నివాసంలో ఆమె సింగరేణి జాగృతి (Singareni Jagruthi) కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
11 ఏరియాలకు జాగృతి కోఆర్డినేటర్లు
ఈ సమావేశంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి పరిధిలో కొత్తగా జాగృతి కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను (Coordinators) నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని, కార్యాచరణను టీబీజీకేఎస్ (TBJKS)తో సమన్వయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. “సింగరేణి కార్మికుల హక్కులను కాపాడటమే మా ధ్యేయం. సంస్థను సంరక్షించేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది” అని ఆమె ప్రకటించారు.
ప్రధాని మోడీకి రేవంత్ పనిచేస్తున్నారు..
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పాలనపై విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ (KCR) నేతృత్వంలో గతంలో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాం. ఆ సంస్థను ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి పాలనలో నాశనం చేయాలనే కుట్ర జరుగుతోంది” అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. “రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీ (Narendra Modi) కోసం పని చేస్తున్నారు. కార్మికులపై ప్రభావం చూపే లేబర్ కోడ్ (Labor Code) గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇది కార్మికుల పట్ల ఉదాసీనతకు నిదర్శనం,” అని మండిపడ్డారు.








