కిడ్నాప్‌కు గురైన వ్యాపారి హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన విష్ణు రూపాని (45) ఎస్ఆర్ నగర్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణు రూపాని కిరాణా స్టోర్ యజమాని. డిసెంబర్ 29న రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 30వ తేదీన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కొత్త సంవత్సరం తొలిరోజు (బుధవారం) సాయంత్రం ఎస్సార్ నగర్ పరిధిలో బుద్ధానగర్‌లో ఒక ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ గదిలో మృతదేహం విష్ణు రూపానిగా గుర్తించారు. మృతదేహం దగ్గర మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం.
గదిలో నివసించే విష్ణు స్నేహితుడు కనిపించకుండా పోవడం విష్ణు రూపాని హత్య కేసుకు కీలకంగా మారింది. సీసీ ఫుటేజీల ఆధారంగా విష్ణు తన స్నేహితుడితో యాక్టివా వాహనంపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు హత్య కాలాన్ని ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరింత వివరాలు తెలియాల్సి ఉంది.