సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ (‘Mirai’) చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, నాణ్యమైన సినిమాటిక్ విలువలను మన దేశంలోనే సాధించగలమని నిరూపించింది. హీరో తేజ సజ్జా (Teja Sajja), దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni), నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్ (T.G.Vishwaprasad) , కృతి ప్రసాద్ (Krithi Prasad) గల బృందం రూపొందించిన ఈ చిత్రానికి సాంకేతిక నైపుణ్యం, అత్యున్నత ప్రొడక్షన్ క్వాలిటీ, నటనలో చూపిన అంకితభావం ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
ఈ నేపథ్యంలోనే, తాజాగా హైదరాబాద్‌లో ‘మిరాయ్’ విజయోత్సవ (Success Celebration) వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయిక రితికా నాయక్, సంగీత దర్శకుడు గౌర హరితో పాటు సినీ ప్రముఖులు వై. రవిశంకర్, శ్రీరామ్ ఆదిత్య, సంపత్ నంది, వెంకటేష్ మహా, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన మాటలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, “ఒక మంచి సినిమా వచ్చిందంటే, దాన్ని ప్రేక్షకులు గౌరవించాలి. ఈ సినిమా కోసం చేసిన కృషి, పడిన శ్రమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా, సాంకేతిక బృందం చేసిన కృషికి ఈ వేడుకను అంకితం చేస్తున్నాం. దర్శకుడు కార్తీక్ మరియు బృందం చూపిన అంకితభావం నిజంగా అభినందనీయం” అని అన్నారు. అలాగే, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ‘మిరాయ్’ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఫ్రాంచైజీగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. “సినిమా తీయడం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి సన్నివేశం ఒక ప్రత్యేక మ్యాజిక్ లా అనిపించింది, అందరి సహకారంతోనే ‘మిరాయ్’ ఈ విజయం సాధించింది” అని పేర్కొన్నారు.








