వైఎస్సార్ కడప జిల్లా (YSR Kadapa District) చెన్నూరు మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది. లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురై న్యాయం కోసం పోలీసులను(Police) ఆశ్రయించిన ఓ బాలికకు (Minor Girl) అండగా నిలవాల్సిన వ్యవస్థే, రాజకీయ నేతలతో కలిసి నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనలో టీడీపీ(TDP) నేతలు, స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, చెన్నూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. కొన్నేళ్ల క్రితం తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తల్లితో కలిసి జీవిస్తోంది. ఇదే గ్రామంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగి బాలికను మాయమాటలతో లోబర్చుకుని, ఆపై బెదిరింపులు చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను తట్టుకోలేక బాధిత బాలిక చివరకు చెన్నూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితుడు, తనపై కేసు నమోదు కాకుండా చూడాలంటూ చెన్నూరు మండలానికి చెందిన టీడీపీ నేతలను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో వారు రంగంలోకి దిగి, పోలీస్ స్టేషన్ వేదికగానే పంచాయితీ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
“ఏమైందో అయింది… కేసు పెడితే ఏం లాభం… ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం” అంటూ బాలికను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేసి రాజీకి ఒప్పించారని సమాచారం.
ఈ పంచాయితీ వ్యవహారంలో భాగంగా, నిందితుడు పోలీసులకు రూ.50 వేల లంచం, పంచాయితీ నిర్వహించిన టీడీపీ నేతలకు రూ.2 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా ఓ బాలిక గౌరవాన్ని డబ్బుతో వెలకట్టిన ఘటనగా ఇది తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.
ఈ దారుణ ఘటనపై ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, పంచాయితీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత బాలికకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఓ బాలికకు సంబంధించిన కేసు మాత్రమే కాకుండా, మొత్తం వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.








