సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ

సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ

పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరు కాకపోవడం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం భామినిలోని ఓ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు స్వయంగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. అయితే, ఈ కీలక కార్యక్రమంలో మంత్రి కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రి పీఏ సతీష్‌పై ఉన్న అత్యాచార కేసు టీడీపీలో తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను సీఎం రావద్దన్నారా? లేక ఆమే పాల్గొనకుండా ఉండిపోయిందా? అనే ప్రశ్నలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

అసలేం జరిగిందంటే?
2021లో క‌రోనాతో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న భర్త చనిపోయి.. తీవ్ర అనా­రో­గ్యం పీడితురాలైన బిడ్డతో.. కారుణ్య ఉద్యోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఓ మహిళను మంత్రి అనుచరుడు, అనధికారిక పీఏ సతీష్‌ ఆర్థికంగా దోచుకోవడంతో పాటు లైంగికంగా వేధించాడు. అంతేకాక, మంత్రి కొడుకు పృథ్వి నీపై మనసుపడ్డాడని, ఆయన వద్దకు వెళ్లు అంటూ పదే పదే వేధించాడని ఆ మహిళ పోలీసులకు తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఈ కేసు వ్యవహారంలో సంధ్యారాణి వ్యవహరిస్తున్న తీరు పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసులో సతీష్‌ను అరెస్ట్ కాకుండా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మంత్రికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆరోపణలతో ఉన్న కుటుంబ సభ్యులను దూరం పెట్టాలని చంద్రబాబు స్పష్టంగా సూచించినప్పటికీ, సంధ్యారాణి తన తీరు మార్చుకోలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం.

ఈ కేసులో బాధిత మహిళను విచారణ పేరుతో 24 గంటలు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఇప్పటి వరకు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పీఏ సతీష్‌ను పోలీసులు విచారించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక, మంత్రి కుమారుడు పృథ్విపైన కూడా ఎలాంటి విచారణ జరగకపోవడం మరిన్ని అనుమానాలను పెంచుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సభకు మంత్రి వెళ్లకపోవడం వెనుక బలమైన కారణం ఉందని టీడీపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. పీఏపై కేసు, కుటుంబ సభ్యులపై ఆరోపణలు, పార్టీ నిర్ణయాలను పట్టించుకోని వ్యవహారం.. అన్నీ సంధ్యారాణికి వ్యతిరేకంగా మారాయని తెలుస్తోంది. ఈ సంఘటనలతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment