కూటమి ప్రభుత్వం (Alliance Government)లో కీలకంగా ఉన్న మంత్రి నారాయణ (Narayana) ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. నెల్లూరు సిటీ టీడీపీ(TDP) నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ మాఫియా (Ration Mafia) వ్యవహారంపై స్పందించిన ఆయన, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ నేతలు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేతల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నన్ను అడిగారు. చిన్న చిన్న పంచాయతీలకైనా వారానికోసారో, పదిహేనురోజులకు ఒకసారో పవన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తోంది. గొప్పల కోసం ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇస్తే పార్టీ అవసరమేమిటి?” అంటూ ఆడియోలో నారాయణ మండిపడ్డారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో పిఠాపురం (Pithapuram) మాజీ ఎమ్మెల్యే వర్మ (Varma)పై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను కాకినాడ ఇన్‌చార్జ్ మంత్రిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్లతో ఘర్షణ. నాపని ఏందంటే.. సర్దడమే.. వర్మకు గతంలో మన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలిచాడు. ఈసారి టికెట్ రాలేదు. ఈ మధ్య అతను కూడా స్టేట్‌మెంట్స్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంథ్స్ నుంచి జీరో చేశాం. అతను కూడా నన్ను జీరో(Zero) చేశాడని అంటున్నాడు. జనసేన వాళ్లు పిలిచి డయాస్ మీద ఇది మాట్లాడమంటే మాట్లాడు అని చెప్పాను. ముఖ్యమంత్రి కూడా పిఠాపురం వర్మను పిలిచి మాట్లాడానికి లేదని నా ముందే ఆదేశాలిచ్చాడు” అని మంత్రి నారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో వైరల్‌గా మారింది.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. “నా శాఖను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ నన్ను అడిగారు. మేము NDA ప్రభుత్వంలోనే ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. మీ శాఖ వ్యవహారాలను నన్ను మాట్లాడ మంటారా అని అడిగారు. అనుమతి లేకుండా ఎవ్వరూ మీడియాతో మాట్లాడొద్దు. నేను ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నాను. కానీ మీ చేష్టల మూలంగా అక్కడ నేను అగౌరవం పాలవుతున్నా. నేను చాలా మంచిగా ఉంటా, కానీ అవసరమైతే రఫ్‌గా ప్రవర్తిస్తా. బి కేర్‌ఫుల్.. అనుమతి లేకుండా మీడియా స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోండి. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
మంత్రి టెలీ కాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మను ప్లాన్ ప్రకారమే పిఠాపురంలో జీరో చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆదేశాలతో తన అభ్యర్థిత్వాన్నే వదులుకున్న వర్మకు ఇలాంటి గతి పడితే, మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటనే అంతర్మథనం ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. అయితే ఈ ఆడియో గురించి మంత్రి నారాయణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.








