ఏపీ మంత్రి నారా లోకేష్ ముచ్చెర్ల పర్యటనను అనూహ్యంగా రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడమే పర్యటన రద్దుకు కారణంగా తెలుస్తోంది. గ్రామస్థుల సవాల్‌తో వెనక్కు తగ్గారు. ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వాలు నమోదయ్యాయని, ఇటీవల టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వంద శాతం సభ్యత్వం నమోదైన ముచ్చెర్ల గ్రామానికి లోకేష్ వస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. గ్రామస్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారని ఎల్లో కథనాలు వచ్చాయి.
టీడీపీ ప్రకటనపై ముచ్చెర్ల గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందశాతం టీడీపీ సభ్యత్వం ఎక్కడ జరిగిందో చూపించాలని గ్రామస్తుల సవాల్ విసిరారు. లోకేష్ వస్తే వంద శాతం సభ్యత్వంపై నిలదీస్తామని హెచ్చరించారు. సభ్యత్వ నమోదులో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దొంగ సభ్యత్వాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ్యత్వాలపై గ్రామస్థులు ఆందోళనతో మంత్రి లోకేష్ ముచ్చెర్ల గ్రామ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.