మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తీరుపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ (Nagarjunasagar) పర్యటన నిమిత్తం ఉదయం 9 గంటలకే బేగంపేట (Begumpet) ఎయిర్‌పోర్టు (Airport)కు చేరుకోవాలని షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గంట ఆలస్యంగా రావడంతో కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉదయం 10 గంటల వరకు కూడా రాలేదు. “తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడు?” అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి చెందిన మంత్రి కోమటిరెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచే అలిగి వెనుదిరిగారు. వెంకట్‌రెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. మంత్రి కోమటిరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు బయలుదేరి వెళ్లారు.