ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) మాజీ కెప్టెన్ (Former Captain) మైఖేల్ క్లార్క్ (Michael Clarke) తన ఆరోగ్యంపై షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ క్లార్క్ తాను క్యాన్సర్ (Cancer)తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. చర్మ క్యాన్సర్ (Skin Cancer) సమస్యతో బాధపడుతున్నానని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తన ముక్కు వద్ద ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని, డాక్టర్లు చికిత్సలో భాగంగా కొంత చర్మాన్ని తొలగించారని క్లార్క్ చెప్పారు.
“ప్రస్తుతం నేను స్కిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా విషయంలో రెగ్యులర్ చెకప్ చాలా కీలకం. చికిత్స కంటే నివారణే ఉత్తమం. అందరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి” అంటూ క్లార్క్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు అభిమానులను కంగారు పెట్టాయి.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇప్పటికే 2006లోనే క్లార్క్‌కు స్కిన్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి పలు సార్లు ఆయన శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ వ్యాధి ముదిరి మరోసారి ఆయనకు చికిత్స అవసరమైంది. తన అనుభవం ద్వారా మరెందరికైనా జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన కలగాలని క్లార్క్ ఆశించారు.








