మెటా సంచలన నిర్ణయం.. సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్!

మెటా సంచలన నిర్ణయం.. సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్!

Summarize with AI

యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడే సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’, ఇప్పుడు తన ఆదాయ వనరులను మరింత వైవిధ్యభరితంగా మార్చుకోవడానికి సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్‌లో యూజర్ల సంఖ్య ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఉన్న యూజర్ల నుంచే అదనపు ఫీచర్ల ద్వారా ఆదాయాన్ని రాబట్టేందుకు ఈ ‘ప్లస్’ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలన్నీ “మెటా వన్” (Meta One) అనే ఒకే గొడుగు కిందికి రానున్నాయి.

ప్రస్తుతం ఉన్న బ్లూ టిక్ (Meta Verified) ప్లాన్ యథావిధిగా కొనసాగుతుందని, ఈ కొత్త ప్లాన్స్ కేవలం అదనపు ఫీచర్లు కోరుకునే పవర్‌ యూజర్ల కోసం మాత్రమేనని మెటా స్పష్టం చేసింది.

యాప్స్ వారీగా ‘ప్లస్’ ప్లాన్ల వివరాలు
ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ (Instagram Plus):
దీని ధర నెలకు $3.99 గా నిర్ణయించారు. ఈ ప్లాన్ తీసుకున్న వారు తమ స్టోరీని ఎంతమంది మళ్లీ మళ్లీ చూశారో (Aggregate Rewatch) తెలుసుకోవచ్చు. ‘క్లోజ్ ఫ్రెండ్స్’ కాకుండా మరిన్ని ఆడియన్స్ లిస్ట్‌లను క్రియేట్ చేయవచ్చు. వారానికి ఒకసారి స్టోరీని హైలైట్ చేసి ఎక్కువ వ్యూస్ పొందవచ్చు. అలాగే, అవతలి వారికి తెలియకుండానే వారి స్టోరీలను ప్రివ్యూ చూడవచ్చు. ఫాలోవర్ల ఫీడ్‌లో కనిపించకుండా నేరుగా ప్రొఫైల్‌కు మాత్రమే పోస్ట్ చేసుకునే సదుపాయం, ప్రొఫైల్ ఫాంట్స్, ప్రొఫైల్ పిన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఫేస్‌బుక్ ప్లస్ (Facebook Plus): దీని ధర కూడా నెలకు $3.99 గా ఉంది. ఇది సామాజిక వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో కస్టమ్ యాప్ ఐకాన్లు, స్టోరీ ఇన్‌సైట్స్ మరియు ప్రత్యేక యానిమేటెడ్ రియాక్షన్ల వంటి ఫీచర్లు లభిస్తాయి.

వాట్సాప్ ప్లస్ (WhatsApp Plus): దీని ధర నెలకు $2.99 గా నిర్ణయించారు. ఇది పర్సనలైజేషన్, మెసేజింగ్‌పై దృష్టి పెడుతుంది. దీని ద్వారా యాప్ థీమ్స్, కస్టమ్ రింగ్‌టోన్స్, మరిన్ని చాట్‌లను పిన్ చేసుకునే సదుపాయం, ప్రీమియం స్టిక్కర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

సాధారణ యూజర్లకు మెటా ఏఐ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. అయితే హెవీ యూజర్స్ కోసం మెటా రెండు కొత్త ప్లాన్లను తెచ్చింది. ఇవి వచ్చే నెల నుంచి సింగపూర్, గౌతమాలా, బొలీవియా దేశాల్లో టెస్టింగ్ ప్రారంభం కానున్నాయి.

మెటా వన్ ప్లస్ (Meta One Plus) – నెలకు $7.99. ఇది ఏఐని ఎక్కువగా ఉపయోగించే సాధారణ పవర్‌ యూజర్ల కోసం తీసుకువ‌చ్చారు.

మెటా వన్ ప్రీమియం (Meta One Premium) – నెలకు $19.99. ఈ ప్రీమియం ప్లాన్ ద్వారా సంక్లిష్టమైన పనుల కోసం ‘థింకింగ్ మోడ్’ (Deeper Reasoning) అన్‌లాక్ అవుతుంది. మెటా యాప్స్‌లో అత్యుత్తమ వీడియో, ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలు లభిస్తాయి. భవిష్యత్తులో మెటా ఏఐ గ్లాసెస్ వాడేవారికి కూడా ఇందులో అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు.

క్రియేటర్లు, బిజినెస్‌ల కోసం “మెటా వన్” ప్లాన్స్
క్రియేటర్లు తమ రీచ్ పెంచుకోవడానికి, వ్యాపారాలు తమ సేల్స్ పెంచుకోవడానికి వీలుగా ఈ వారం నుంచి సౌదీ అరేబియా, మొరాకో, థాయిలాండ్, బంగ్లాదేశ్‌లలో ఈ క్రింది ప్లాన్స్ టెస్ట్ చేయనున్నారు.

మెటా వన్ ఎసెన్షియల్ (Meta One Essential) – నెలకు $14.99. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్ (Verified Badge), అకౌంట్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అలాగే ఒకే చోట అన్ని సోషల్ మీడియా లింకులను ఉంచుకునేలా ‘ఎన్‌హాన్స్‌డ్ లింక్‌షీట్’ (Enhanced Linksheet) సదుపాయం ఉంటుంది.

మెటా వన్ అడ్వాన్స్‌డ్ (Meta One Advanced) – నెలకు $49.99. ఎసెన్షియల్ ప్లాన్ ఫీచర్లతో పాటు, ఫేస్‌బుక్ ఫీడ్‌లో ప్రమోషన్ లభిస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. రీల్స్‌పై బోల్డ్ “Follow” బటన్, మీ కంటెంట్‌తో ఎంగేజ్ అయిన వారికి ఆటోమేటిక్‌గా ఫాలో ఇన్విటేషన్లు వెళ్లే ఫీచర్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్ ద్వారా నేరుగా వెబ్‌సైట్ లేదా షాప్‌కి ట్రాఫిక్ మళ్లించే సదుపాయం, పాస్‌వర్డ్ షేర్ చేయకుండానే ఇతర మోడరేటర్లకు యాక్సెస్ ఇచ్చే టూల్స్, ఆప్టిమైజ్డ్ షెడ్యూలింగ్ టూల్స్ ఇందులో ఉన్నాయి. మీ ఒరిజినల్ రీల్స్‌ను ఎవరైనా కాపీ చేస్తే అలర్ట్ వచ్చే సిస్టమ్ కూడా ఇందులో లభిస్తుంది.

“మేము ప్రస్తుతం ఈ ఏఐ, ప్రొఫెషనల్ ప్లాన్లను టెస్ట్ చేస్తున్నాం. కాలక్రమేణా వీటన్నింటినీ ‘మెటా వన్’ కిందికి తెచ్చి మరిన్ని ఫీచర్లను జోడిస్తాం,” అని మెటా ప్రొడక్ట్ హెడ్ నాఓమి గ్లీట్ (Naomi Gleit) తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment