మెస్సీ టూర్ ఎఫెక్ట్‌.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా

మెస్సీ టూర్ ఎఫెక్ట్‌.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా

ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి (State Sports Minister) అరూప్ బిస్వాస్ (Arup Biswas) తన పదవికి రాజీనామా (Resignation) చేయగా, ఆ రాజీనామాను ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) వెంట‌నే ఆమోదించారు. మెస్సీ రాక సందర్భంగా ఈవెంట్ నిర్వహణలో జరిగిన అప‌శృతికి నైతిక బాధ్యత వహిస్తూ అరూప్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నెల 13వ తేదీన కోల్‌కతాలో మెస్సీ పర్యటన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. అభిమానుల ఆగ్రహం, విధ్వంసం కారణంగా ఈ ఈవెంట్ తీవ్ర వివాదంగా మారింది. ఘటన అనంతరం సీఎం మమతా బెనర్జీ క్రీడాకారులకు, అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా, మెస్సీ ఈవెంట్‌ను నిర్వహించిన ఆర్గనైజర్లను రెండు రోజుల క్రితం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ ఘటనపై కఠినంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగంపై చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్, బిధన్‌నగర్ సీపీ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అదే విధంగా, కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ డీసీపీ అనీష్ సర్కార్ (ఐపీఎస్)పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెస్సీ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలు బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టగా, వరుస చర్యలతో పరువు నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment