ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్స్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, ఈ వ్యవహారంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ భావోద్వేగంగా స్పందించారు. ఎన్పీఆర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. “ఎప్స్టీన్ ఫైల్స్ నా వివాహ జీవితంలో చాలా బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ లాంటి వ్యక్తుల చేతుల్లో ఏ అమ్మాయి కూడా చిక్కుకోకూడదని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తనకు కాకుండా, సంబంధం ఉన్నవారే సమాధానం చెప్పాలని స్పష్టం చేస్తూ, “ఈ ఆరోపణలపై నా మాజీ భర్తే మాట్లాడాలి… ఇది నా బాధ్యత కాదు” అని తేల్చి చెప్పారు.
ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్న యువతులను చూసినప్పుడు తీవ్ర వేదన కలిగిందని మిలిందా తెలిపారు. “నా బాధను నేను భరించగలను కానీ, ఆ అమ్మాయిల పరిస్థితి గురించి ఆలోచిస్తే మనసు కలచివేస్తుంది” అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. బిల్ గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న విషయం తనకు తీవ్ర మానసిక క్షోభను కలిగించిందని, ఆ పరిస్థితులను తట్టుకోలేకే 2021లో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్న బాధిత మహిళలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో ఎప్స్టీన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.








