టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా గురించి, విశ్వక్ సేన్ నటన, రైటింగ్ స్కిల్స్‌ను మెచ్చుకున్న మెగాస్టార్, విశ్వక్ నాన్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా రాజకీయ ప్రస్తావన తీసుకువచ్చారు. లైలా సినిమా ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. విశ్వక్‌సేన్ తండ్రి కరాటే రాజు తనకు 17, 18 సంవత్సరాలుగా తెలుసు అని, ప్రజాస్వామ్యం స్థాపించినప్పుడు తన వెంట ఉన్నారని వ్యాఖ్యానించిన మెగా బాస్.. సినిమా ఈవెంట్‌లో ‘జై జనసేన’ అని నినదించారు. ఇంకాస్త ముందుకెళ్లి జనసేన పార్టీ పట్ల తనకు సంతోషంగా ఉందని, నాటి ప్రజారాజ్యమే.. నేడు జనసేనగా రూపాంతరం చెందింది.. ఐయామ్ వెరీ హ్యాపీ అని చెప్పుకొచ్చారు.
తన స్టార్ డమ్ పెట్టుబడిగా 2008 ఆగస్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. మెగాస్టార్‌గా తాను సాధించుకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఆ తరువాతి ఎన్నికల్లో పోటీచేసి 18 సీట్లు సాధించారు. రాజకీయాల్లో ఇమడలేక, పార్టీని ఎక్కువకాలం నడపలేక 2011 ఫిబ్రవరి 6న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఫలితంగా 2012లో రాజ్యసభ ఎంపీ పదవి పొంది.. అదే సంవత్సరం కేంద్రమంత్రి ఆఫర్ స్వీకరించారు. కేంద్ర మంత్రి పదవి పూర్తయిన తరువాత రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు.
క్వశ్చన్ ఏంటంటే..
తాను స్థాపించిన రాజకీయ పార్టీని నడిపేంత శక్తిలేక ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రజారాజ్యమే.. జనసేనగా రూపాంతరం చెందింది అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది కేవలం పేరునేనా..? విలీనం కంటే ముందే యువరాజ్యం నడిపించిన తన తమ్ముడితో కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ వేశారా..? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీకి జై కొట్టడం ఏంటి..? మళ్లీ రాజకీయాల్లోకి రానని ప్రకటించిన మెగాస్టార్.. జనసేనకు జై కొట్టి తన పొలిటికల్ రీఎంట్రీని కన్ఫామ్ చేశారా..? ఎప్పుడూ విలువల గురించి ప్రస్తావించే చిరంజీవి.. కాంగ్రెస్‌కు రిజైన్ చేయకుండా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనకు జై కొట్టడం, మెర్జ్ చేసిన ప్రజారాజ్యమే జనసేన అని ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో పై విధంగా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి.