జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12 వరకు అరెస్టు చేయకూడదని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ట్రయల్ కోర్టులో హాజరు నుంచి కూడా కేటీఆర్‌కు మినహాయింపు ఇచ్చింది.
ఇంతకుముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ, కేటీఆర్‌తో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లకు కూడా ఊరట కల్పించింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
గతేడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన కేటీఆర్, వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లు – ఎటువంటి అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారని మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తాము ఎటువంటి తప్పు చేయలేదని, తమపై పెట్టిన కేసులు అవాస్తవమని పేర్కొంటూ విచారణను నిలిపివేయాలని, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టులో కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్‌లు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేశారు.