మ్యాక్స్‌వెల్ విధ్వంసం: గేల్, కోహ్లి సరసన చేరిన ఆసీస్ స్టార్!

మ్యాక్స్‌వెల్ విధ్వంసం: గేల్, కోహ్లి సరసన చేరిన ఆసీస్ స్టార్!

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ఎడిషన్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ (Los Angeles Knight Riders)తో జూన్ 18న జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం (Washington Freedom) కెప్టెన్ (Captain), ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) సుడిగాలి శతకంతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ కేవలం 49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఎనిమిదో సెంచరీ.

టీ20 సెంచరీల క్లబ్‌లో మ్యాక్స్‌వెల్
ఈ సెంచరీతో మ్యాక్స్‌వెల్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లి (Chris Gayle, Virat Kohli) టీ20 సెంచరీల క్లబ్‌లో చేరాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో 10వ స్థానానికి దూసుకొచ్చాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 22 శతకాలు బాదగా, ఆ తర్వాత పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (11) ఉన్నాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 9 సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో మ్యాక్స్‌వెల్.. మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, రోహిత్ శర్మల సరసన చేరాడు. వీరంతా పొట్టి క్రికెట్‌లో తలో ఎనిమిది సెంచరీలు బాదారు.

టీ20లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్-10 క్రికెటర్లు:
క్రిస్ గేల్ – 22
బాబర్ ఆజమ్ – 11
విరాట్ కోహ్లి – 9
రిలీ రొస్సో – 9
మైఖేల్ క్లింగర్ – 8
ఆరోన్ ఫించ్ – 8
డేవిడ్ వార్నర్ – 8
జోస్ బట్లర్ – 8
రోహిత్ శర్మ – 8
గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 8
మ్యాచ్ వివరాలు
మ్యాచ్ విషయానికొస్తే, మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) క్రీజులోకి వచ్చిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత విశ్వరూపం చూపిన మ్యాక్సీ.. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు.

ఒబస్ పియెనార్ (15 బంతుల్లో 11 నాటౌట్)ను మరో ఎండ్‌లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసం కొనసాగించాడు. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో మ్యాక్సీ మినహా మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. రచిన్ రవీంద్ర 8, ఆండ్రియస్ గౌస్ 12, మార్క్ చాప్‌మన్ 17, జాక్ ఎడ్వర్డ్స్ 11 పరుగులు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా, జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 16.3 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ ఓవెన్ తలో 3 వికెట్లు, సౌరభ్ నేత్రవల్కర్ 2, మార్క్ అడైర్, ఇయాన్ హోలండ్ చెరో వికెట్ పడగొట్టి నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సైఫ్ బదార్ (32), జేసన్ హోల్డర్ (23), షాడ్లే (12), కోర్నె డ్రై (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ జట్టులో తొలి ముగ్గురు బ్యాటర్లు అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్ డకౌట్ కాగా, రోవ్‌మన్ పావెల్ (4), మాథ్యూ ట్రంప్ (2), ఆండ్రీ రసెల్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సూపర్ సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment