అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) మారేడుమిల్లి (Maredumilli) అటవీప్రాంతం ఈ తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ (Encounter)తో కుదిపేసింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, వారిలో అత్యంత ముఖ్యుడైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Hidma) కూడా ఉన్నట్లు సమాచారం. హిడ్మా భార్య హేమ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు వివరాలు వెల్లడయ్యాయి.
సమీప ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మారేడుమిల్లి టైగర్ రిజర్వ్ జోన్‌లో పోలీసులు మావోయిస్టులను ఎదుర్కొన్నారని సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో రూ.1 కోటికి పైగా రివార్డు ఉన్న హిడ్మా హతం కావడం భద్రతా వ్యవస్థలకు పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా కూంబింగ్ కొనసాగుతుందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
హిడ్మా అసలు పేరు విలాస్. పూవర్తి (సుక్మా జిల్లా)కు చెందిన అతను హిడ్మాల్, సంతోష్ పేర్లతో కూడా తిరిగేవాడు. వయసు 50 ఏళ్లు దాటిన హిడ్మాకు గెరిల్లా వార్‌ఫేర్‌లో అపూర్వమైన నైపుణ్యం ఉండేది. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టున్న అతను దండకారణ్యంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. 2017లో జరిగిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ఈయనే కారణమని భద్రతా దళాలు భావిస్తాయి.








