హెచ్ సీయూ (HCU), ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ల్లో నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకున్న నిర్ణయంపై మావోయిస్టు (Maoist) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ (Jagan) పేరుతో విడుదలైన లేఖలో, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడిపోయాయని ఆందోళన వ్యక్తమైంది.
ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణిచివేస్తోందని, నియంతృత్వ పద్ధతులు అమలు చేస్తూ పౌర స్వేచ్ఛను కాలరాస్తోందని మావోయిస్టులు లేఖ (Letter) లో విమర్శించారు. విద్యార్థుల పోరాటాలను అణిచివేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.
విద్యను కార్పొరేట్ల చేతికి అప్పగించేందుకే ఆంక్షలా?
ప్రభుత్వం విద్య (Education) ను ప్రైవేటీకరించేందుకు కార్పొరేట్ సంస్థలకు (Corporate Companies) అనుకూలంగా నడుచుకుంటోందని మావోయిస్టులు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు ప్రత్యేక స్థానం ఉందని, నేటి పాలకులు విద్యార్థుల చరిత్రను మర్చిపోతున్నారని లేఖలో విమర్శలు గుప్పించారు. ఓయూలో విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఆంక్షలను ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.