మావోయిస్టు పార్టీ (Maoist Party) పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల (Mallojula) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటిస్తూ, అనివార్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తాను ఇకపై ఆయుధాలను విడిచి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన 22 పేజీల లేఖను విడుదల చేశారు. “చేసిన తప్పులకు, ఉద్యమాన్ని ఓటమి పాలవకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను. ఈ దశలో నేను పార్టీ బాధ్యతల్లో కొనసాగడం సమంజసం కాదని భావిస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.
మల్లోజుల తన లేఖలో పార్టీ అంతర్గత పరిస్థితులను, నాయకత్వ సమస్యలను కూడా ప్రస్తావించారు. “దీర్ఘకాల విప్లవచరణలో చేసిన తప్పుల మూలంగా ఉద్యమం బలహీనపడింది. మన పంథా సరిగా ఉందని చెప్పుకుంటున్నా, అది ప్రజా ఉద్యమానికి దోహదం కావడంలేదు. తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడమే నిజమైన విప్లవ మార్గం” అని తెలిపారు.
“ఇప్పుడైనా సానుకూల మార్పు అవసరం. అనవసర త్యాగాలకు ముగింపు పలికి, కేడర్లను కాపాడే దిశగా అడుగులు వేయాలి. కొత్త దారుల్లో ముందుకు సాగుదాం – చివరికి విజయం ప్రజలదే,” అని మల్లోజుల తన లేఖను ముగించారు.








