దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) ప్రభావంతో మావోయిస్టు అగ్రనేతలు వరుసగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ముఖ్యంగా సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Keshav Rao) అలియాస్ (Alias) బస్వరాజ్ (Baswaraj) ఎన్‌కౌంటర్ (Encounter)లో మరణించిన తర్వాత పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోపం, అంతర్గత విభేదాలు, భద్రతా దళాల ఒత్తిళ్లు లొంగుబాటుకు ప్రధాన కారణాలవుతున్నాయి.
ఆశన్న భారీ లొంగుబాటు:
తాజాగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న (తక్కపల్లి వాసుదేవరావు) శుక్రవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ (Takkapalli Vasudeva Rao) ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న.. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, ఐపీఎస్ ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు.
జగదల్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశన్న (Ashanna)తో పాటు మొత్తం 208 మంది మావోయిస్టులు (వీరిలో 110 మంది మహిళా మావోయిస్టులు) 153 తుపాకులతో కలిసి ఆయుధాలు అప్పగించారు. ఈ కీలక నేత లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బగా పరిగణించవచ్చు.
తెలంగాణ నేత బండి ప్రకాశ్ కూడా..
మరోవైపు, మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ (Bandi Prakash) (అలియాస్ ప్రభాత్, అశోక్) కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రకాశ్.. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ ఎదుట ఆయన లొంగిపోయే ఛాన్స్ ఉంది.
2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్‌ను భద్రతా దళాలు మరింత ఉధృతం చేశాయి.








