జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో జైలు అధికారులు అప్రమత్తమై, బాధిత ఖైదీలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భోజనం తర్వాత కొంతమంది ఖైదీలు ఇబ్బందికి గురయ్యారని తెలిసిన వెంటనే హుటాహుటిని ఆస్పత్రికి తరలించారని నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.
ఒకరి పరిస్థితి విషమం
ఖైదీలకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 45 మందిలో ఒక ఖైదీ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటనే దానిపై అధికారుల విచారణ కొనసాగుతోంది. జైలులో ఖైదీలకు సురక్షితమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని ఖైదీల కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.