బెట్టింగ్ యాప్ (Betting App) మనీలాండరింగ్ (Money Laundering) కేసు టాలీవుడ్ (Tollywood)లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) తమ దర్యాప్తును వేగవంతం చేసింది. గత కొన్ని వారాలుగా ఈ వ్యవహారంలో ఉన్న ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి ప్రముఖులు ఈడీ ముందు హాజరై తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వీరితో పాటు పలువురు యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయల మేర అక్రమ నగదు బదిలీ (మనీలాండరింగ్) జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా దేశంలోపల, బయట భారీగా లావాదేవీలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, డబ్బు పంపిణీ, చెల్లింపులు, ప్రచార కార్యక్రమాలు (ప్రమోషనల్ ఈవెంట్స్), బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో భాగస్వామ్యంపై ఈడీ సాక్ష్యాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే, పలువురు సినీ ప్రముఖులు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.
ఈరోజు (ఆగస్టు 13) నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) కూడా ఈడీ(ED) విచారణకు (Investigation) హాజరయ్యారు. ఆమె ప్రచారం చేసిన కార్యక్రమాలు (ఈవెంట్స్), వాటికి సంబంధించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ ప్రధానంగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విచారణకు వచ్చినవారు ఈ మనీలాండరింగ్ వ్యవహారం గురించి తమకు తెలియదని స్పష్టం చేసినప్పటికీ, అధికారులు మాత్రం ఆర్థిక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొంతమంది నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.







