మంచు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు ఇద్దరినీ విచారణకు పిలిచారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ కీలక డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యారు. మోహన్ బాబు తన ఆస్తుల్లో అక్రమ కబ్జాలను ఖాళీ చేయించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆయన తెలిపారు. మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో నివసిస్తున్నారు.
కుటుంబంలో విభేదాలు – అధికారుల జోక్యం
సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తిరిగి స్వాధీనం చేయాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి మనోజ్‌కు నోటీసులు పంపారు. అలాగే, పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదికను సేకరించారు. మనోజ్ ఇప్పటికే సబ్‌కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ వివాదంపై మనోజ్ స్పందిస్తూ, “ఇది ఆస్తి గొడవ కాదు, మా విద్యాసంస్థలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఇలా ప్రచారం చేస్తున్నారు” అని తెలిపారు. కుటుంబసభ్యులంతా కలిసి మాట్లాడుకుందామన్నా ఎవరూ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు, మనోజ్ మరోసారి రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే.