రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ప్రాణాలను కాపాడి హీరోగా మారిన రజత్ కుమార్(Rajat Kumar).. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజత్.. చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతను విషం తాగి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు.
25 ఏళ్ల రజత్.. మను కశ్యప్ (21) అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమె కుటుంబం ఈ ప్రేమను అంగీకరించలేదు. ప్రేమను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 9న రజత్ తన ప్రియురాలితో కలిసి విషం తీసుకున్నాడు. ఈ ఘటనలో మను కశ్యప్ ప్రాణాలు కోల్పోగా, రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది.
చావుబతుకుల మధ్య పోరాటం
2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు, రజత్ కుమార్ తన స్నేహితుడితో కలిసి అతని ప్రాణాలను కాపాడాడు. ఆ సంఘటనతో రజత్ మీడియాలో గుర్తింపు పొందాడు. రిషబ్ పంత్ ఆయనకు కృతజ్ఞతగా రెండు స్కూటర్లు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడుతుండగా, అతని ప్రాణాలను కాపాడిన వ్యక్తి ప్రాణాపాయం లో ఉండటం విచారకరం.