తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 వందల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసింది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో ఎస్ఏఎస్ షాప్ యజమాని మెహబూబ్ సాహెబ్ వద్ద రుద్ర అనే వ్యక్తి రూ.15 వందలు అప్పుగా తీసుకున్నాడు. మూడు నెలలు గడుస్తున్నా.. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో రుద్రను నిలదీశాడు సాహెబ్. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఇంటికి వెళ్లి అనుచరులను వెంటబెట్టుకొచ్చిన రుద్ర.. షాప్‌లో సాహెబ్ లేకపోవడంతో అదే షాప్‌లో పనిచేస్తున్న అజమ్ తుల్లాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అజమ్ తుల్లా మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.








