మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “నేను మహాకుంభ మేళాను గౌరవిస్తాను, గంగామాతను గౌరవిస్తాను. కానీ అక్కడ సరైన ప్రణాళిక లేదు. డబ్బున్నవారికి, వీఐపీలకు ప్రత్యేక క్యాంపులు (టెంట్లు) ఏర్పాటయ్యాయి. కానీ, సామాన్య భక్తులకు కనీస వసతులు కూడా లేవు. మేళాలో తొక్కిసలాట జరగడం సహజమే, కానీ అలాంటివి జరగకుండా ముందస్తు ప్రణాళికలు ఉండాలి. కేంద్రం, యూపీ బీజేపీ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది?” అని ప్రశ్నించారు.

బీజేపీకి భయపడను
మమతా బెనర్జీపై బీజేపీ నేతలు “ఆమెకు బంగ్లాదేశీ ఛాందసవాదులతో సంబంధాలున్నాయి” అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “మీ ఆరోపణలు రుజువు చేయండి. మీకు ధైర్యం ఉంటే నిర్ధారణలు చూపండి. నేను సిద్ధంగా ఉన్నాను, రుజువైతే వెంటనే నా పదవికి రాజీనామా చేస్తాను” అంటూ సవాలు విసిరారు.

ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తా..
బీజేపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోంది. ప్రజలను విడగొట్టే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అసహ్యతకరం. ఈ వ్యాఖ్యలపై నేను ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తాను” అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment