బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై ఎమ్మెల్సీ (MLC) తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ (Telangana)లో తీవ్ర దుమారం రేపాయి. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను ఉద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్ (Gunman) గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. తీన్మార్ మల్లన్న ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖకు సరెండర్ చేయించి, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మల్లన్న ఆదేశిస్తేనే కాల్పులు జరిపినట్లు గన్మెన్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.
కాగా, ఎమ్మెల్సీ కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం (Q News Office)పై దాడి చేసి, ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆయన గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలపై తీన్మార్ మల్లన్న, కవిత ఇద్దరూ తగ్గడం లేదు. “సై అంటే సై” అంటున్నారు.
మల్లన్న ఆరోపణలు
తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. తాను అన్నది తెలంగాణ సామెత మాత్రమేనని, తన వ్యాఖ్యలపై తగ్గేది లేదని ఎమ్మెల్సీ మల్లన్న స్పష్టం చేశారు. బీసీల పార్టీ ప్రకటించడంతో కవిత తనపై దాడి చేయించారని, బీసీలను అణచివేయాలని ప్రయత్నిస్తున్న కవితను రాష్ట్రంలో బీసీలు తిరగనివ్వరని హెచ్చరించారు.
కవిత ప్రతిస్పందన
మల్లన్న తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. “ఆడబిడ్డను నోటికొచ్చినట్లు మాట్లాడి తెలంగాణ సామెత అన్నానంటే సహించేది లేదు. మహిళనని చూడకుండా మల్లన్న హీనమైన మాటలు మాట్లాడారు. ఆడబిడ్డలు తలచుకుంటే మల్లన్న బయట తిరగలేరు” అని కవిత అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మల్లన్నను అరెస్ట్ చేయాలని, లేకపోతే మల్లన్నతో సీఎం మాట్లాడించినట్టు భావిస్తామని హెచ్చరించారు. “సీఎం ఇంటి బిడ్డలకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా?” అని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే NHRCని కూడా కలుస్తానని కవిత పేర్కొన్నారు.








