కొడుకు శ‌వంతో స్మ‌శానంలో తండ్రి.. క‌న్నీళ్లు తెప్పించే ఘటన (Video)

కొడుకు శ‌వంతో స్మ‌శానంలో తండ్రి.. క‌న్నీళ్లు తెప్పించే ఘటన

బ్రతుకున్నప్పుడూ తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను అంటూ 8 ఏళ్ల కొడుకు మృత‌దేహాన్ని త‌న ఒడిలో ప‌డుకోబెట్టుకొని స్మ‌శానంలో తండ్రి విల‌విల‌లాడుతున్న హృదయ విదారక సంఘటన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో చూప‌రుల‌ను కంట‌త‌డి పెట్టిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్ పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. పత్తి మిల్లు మూతపడ్డంతో ఆదాయం పూర్తిగా నిలిచిపోగా, భార్య కూడా చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోవడంతో, దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ తండ్రి ద‌గ్గ‌రే ఉండిపోయాడు.

ఏ చిన్న పని అయినా చేసి త‌న దివ్యాంగ కుమారుడిని పోషించాల‌ని ఓ హోటల్‌లో చేరాడు. హోట‌ల్‌లో ప‌నిచేస్తూ పెద్ద కుమారుడిని పోషించుకుంటున్నాడు. అయితే దివ్యాంగుడైన హరీష్ అప్ప‌టికే అనారోగ్యంతో బాధపడుతుండగా, చికిత్సకు డబ్బులు లేకపోవడంతో పరిస్థితి విషమించిపోయి కుమారుడు కన్నుమూశాడు. తన ఒడిలో ప్రాణం కోల్పోయిన కొడుకును చూసి తండ్రి పరిస్థితి ఎవరినైనా కన్నీళ్లు పెట్టించేలా మారింది.

మృతదేహాన్ని తీసుకుని స్మశానానికి వెళ్లిన బాలరాజ్‌కు అక్కడ మరో దెబ్బ ఎదురైంది. అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన డబ్బులు కూడా లేనందున, హరీష్ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని 8 గంటలపాటు స్మశానంలోనే విలవిలలాడుతూ కూర్చున్నాడు. “బ్రతుకున్నప్పుడూ తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను” అంటూ అతడు కన్నీరుమున్నీరయ్యాడు. అతడి ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలవరంలో పడేశాయి.

ఈ హృదయ విదారక సంఘటన సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ, బాధలో ఉన్న బాలరాజ్‌కు సహాయం అందించాలని పలువురు ముందుకు వస్తున్నారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాలని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment