ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు బుధవారం ప్రకటించారు. పుణ్యస్నానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం అర్ధరాత్రి 1:00 నుంచి 2:00 గంటల మధ్య జరిగిన తొక్కిసలాట (Stampede) జరిగిందని, ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు.
మృతుల్లో ఇప్పటివరకు 25 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి అధికమై, బారికేడ్లు విరిగిపోయి ఈ ప్రమాదం సంభవించినట్లుగా వివరించారు. బాధిత కుటుంబాలకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సర్కార్ నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున మొత్తం 30 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు చేరుకోగా అర్థరాత్రి 1 గంట తర్వాత తొక్కిసలాట జరిగింది.