గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీవ్రంగా స్పందిస్తోంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను హైడ్రా కూల్చివేయడం ప్రారంభించింది. తాజాగా, మాదాపూర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనంపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా కమిసనర్ రంగనాథ్ రంగం సిద్ధం చేశారు.
అయ్యప్ప సొసైటీలో సెట్‌బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వచ్చింది. అధికారులు పలుసార్లు హెచ్చరించినప్పటికీ బిల్డర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలుస్తోంది. దీంతో రంగనాథ్ మాదాపూర్‌లో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు.
నేడు కూల్చివేతలు..
హైడ్రా కమిషనర్ పరిశీలనలో భవనానికి సరైన అనుమతులు లేవని తేలడంతో కూల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం నేడు ఆ భవనాన్ని కూల్చివేయనున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటూ హైడ్రా చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది.